← SongOfSongs (2/8) → |
1. | నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను. |
2. | బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. |
3. | అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. |
4. | అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. |
5. | ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి |
6. | అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. |
7. | యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. |
8. | ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు. |
9. | నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు |
10. | ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు |
11. | నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. |
12. | దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. |
13. | అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము |
14. | బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము. |
15. | మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి. |
16. | నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు |
17. | చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము. |
← SongOfSongs (2/8) → |