← Psalms (65/150) → |
1. | దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది. |
2. | ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు |
3. | నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. |
4. | నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము. |
5. | మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు చున్నావు |
6. | బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనె |
7. | ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు. |
8. | నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులును భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు. |
9. | నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. |
10. | దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు. |
11. | సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. |
12. | అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని యున్నవి. |
13. | పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి. |
← Psalms (65/150) → |