← Psalms (34/150) → |
1. | నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. |
2. | యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. |
3. | నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. |
4. | నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. |
5. | వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. |
6. | ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను. |
7. | యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును |
8. | యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. |
9. | యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. |
10. | సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. |
11. | పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. |
12. | బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా? |
13. | చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము. |
14. | కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము. |
15. | యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. |
16. | దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. |
17. | నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును. |
18. | విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. |
19. | నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం చును. |
20. | ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు. |
21. | చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ బడుదురు |
22. | యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు లుగా ఎంచబడరు. |
← Psalms (34/150) → |