← Matthew (5/28) → |
1. | ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి. |
2. | అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను |
3. | ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. |
4. | దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. |
5. | సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. |
6. | నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు. |
7. | కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. |
8. | హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. |
9. | సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు. |
10. | నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. |
11. | నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. |
12. | సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. |
13. | మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. |
14. | మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. |
15. | మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలు గిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. |
16. | మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. |
17. | ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. |
18. | ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. |
19. | కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. |
20. | శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. |
21. | నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. |
22. | నేను మీతో చెప్పునదేమనగాతన సహో దరునిమీద1 కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. |
23. | కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల |
24. | అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. |
25. | నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. |
26. | కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. |
27. | వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; |
28. | నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. |
29. | నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. |
30. | నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. |
31. | తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా; |
32. | నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించు చున్నాడు. |
33. | మరియునీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా, |
34. | నేను మీతో చెప్పునదేమనగాఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము,ఒ భూమి తోడన వద్దు, |
35. | అది ఆయన పాదపీఠము, యెరూష లేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము |
36. | నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. |
37. | మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి2 పుట్టునది. |
38. | కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. |
39. | నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. |
40. | ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము. |
41. | ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము. |
42. | నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. |
43. | నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు మని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; |
44. | నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. |
45. | ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. |
46. | మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. |
47. | మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. |
48. | మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. |
← Matthew (5/28) → |