← John (13/21) → |
1. | తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను. |
2. | వారు భోజనము చేయు చుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు డగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది3 ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక |
3. | తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి |
4. | భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. |
5. | అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. |
6. | ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. |
7. | అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా |
8. | పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. |
9. | సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను. |
10. | యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. |
11. | తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుకమీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. |
12. | వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండినేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? |
13. | బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. |
14. | కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. |
15. | నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. |
16. | దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. |
17. | ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు. |
18. | మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్ప రచుకొనినవారిని ఎరుగుదును గానినాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును. |
19. | జరిగి నప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను. |
20. | నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. |
21. | యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడిమీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను |
22. | ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహ పడుచు ఒకరితట్టు ఒకరు చూచు కొనుచుండగా |
23. | ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను |
24. | గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. |
25. | అతడు యేసు రొమ్మున ఆనుకొనుచుప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. |
26. | అందుకు యేసునేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; |
27. | వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసునీవు చేయు చున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా |
28. | ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజన మునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు. |
29. | డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. |
30. | వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ. |
31. | వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెనుఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవు డును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు. |
32. | దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును. |
33. | పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను. |
34. | మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. |
35. | మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. |
36. | సీమోను పేతురుప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లు చున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరు వాత వచ్చెదవని అతనితో చెప్పెను. |
37. | అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా |
38. | యేసునాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. |
← John (13/21) → |