← Job (40/42) → |
1. | మరియు యెహోవా యోబునకు ఈలాగు...ప్రత్యుత్తరమిచ్చెను |
2. | ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్య వలెను. |
3. | అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను |
4. | చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును. |
5. | ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను. |
6. | అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను |
7. | పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము. |
8. | నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప రాధము మోపుదువా? |
9. | దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా? |
10. | ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించు కొనుము గౌరవప్రభావములను ధరించుకొనుము. |
11. | నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగ జేయుము. |
12. | గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము. |
13. | కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము. |
14. | అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్నుగూర్చి ఒప్పుకొనెదను. |
15. | నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును. |
16. | దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. |
17. | దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి. |
18. | దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి |
19. | అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. |
20. | పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును. |
21. | తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును |
22. | తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును. |
23. | నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. |
24. | అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? |
← Job (40/42) → |