← Ezekiel (32/48) → |
1. | మరియు పండ్రెండవ సంవత్సరము పండ్రెండవనెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను |
2. | నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుముజనములలో కొదమ సింహమువంటివాడ వని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి. |
3. | ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. |
4. | నేను నిన్ను నేల పడవేసి తెరపనేలమీద పారవేసెదను, ఆకాశపక్షులన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూజంతువులన్నిటిని కడుపార తిననిచ్చెదను, |
5. | నీ మాంస మును పర్వతములమీద వేసెదను, లోయలన్నిటిని నీ కళే బరములతో నింపెదను. |
6. | మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతములవరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును. |
7. | నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును. |
8. | నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
9. | నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును, |
10. | నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు. |
11. | ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాబబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును, |
12. | శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్య మును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును. |
13. | మరియు గొప్పప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును. |
14. | అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
15. | నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలముచేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. |
16. | ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
17. | పండ్రెండవ సంవత్సరము నెల పదునైదవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను |
18. | నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమునుగూర్చి అంగలార్చుము, ప్రసిద్ధినొందిన జన ముల కుమార్త్తెలు భూమిక్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. |
19. | సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు?దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము. |
20. | ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి. |
21. | వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అని యందురు; పాతాళ ములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు. |
22. | అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చి యున్నారు. |
23. | దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి. |
24. | అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారు అవమానము నొందుదురు. |
25. | హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు సజీవులలోకములో భయం కరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును. |
26. | అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి. |
27. | అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుధ్దాయుధము లను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను. |
28. | నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు. |
29. | అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతు లందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి. |
30. | అక్కడ ఉత్తరదేశపు అధిపతులందురును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు. |
31. | కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
32. | సజీవుల లోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైనవారియొద్ద సున్నతిలేనివారితో కూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
← Ezekiel (32/48) → |