← Exodus (36/40) → |
1. | పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను. |
2. | బెసలేలును అహోలీ యాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని మోషే పిలిపించెను. |
3. | ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చు చుండిరి. |
4. | అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి |
5. | మోషేతోచేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా |
6. | మోషేపరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది |
7. | గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి. |
8. | ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను. |
9. | ప్రతి తెరపొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. |
10. | అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. |
11. | మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. |
12. | ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను. |
13. | మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. |
14. | మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుక లతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగాచేసెను. |
15. | ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు; |
16. | ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను. |
17. | మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకు లను చేసెను. |
18. | ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను. |
19. | మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. |
20. | మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను. |
21. | పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర. |
22. | ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మంది రముయొక్క పలకలన్నిటికి చేసెను. |
23. | కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. |
24. | ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను. |
25. | మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను, |
26. | అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మ లను చేసెను. |
27. | పడమటి దిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను. |
28. | వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను. |
29. | అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను. |
30. | ఎనిమిది పలక లుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను. |
31. | మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను |
32. | మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను. |
33. | పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను. |
34. | ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను. |
35. | మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను. |
36. | దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను. |
37. | మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డ తెరను చేసెను. |
38. | దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి. |
← Exodus (36/40) → |