← Exodus (30/40) → |
1. | మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను. |
2. | దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను. |
3. | దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను. |
4. | దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను. |
5. | అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. |
6. | సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును. |
7. | అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. |
8. | మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. |
9. | మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీ యమునైనను దానిమీద పోయకూడదు. |
10. | మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సర మునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. |
11. | మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. |
12. | వారు లెక్కింప బడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. |
13. | వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. |
14. | ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను. |
15. | అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్య కూడదు. |
16. | నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థ ముగా నుండును. |
17. | మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుకడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటనుచేసి |
18. | ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. |
19. | ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. |
20. | వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. |
21. | తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొన వలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. |
22. | మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో |
23. | పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తుల ముల యెత్తును |
24. | నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని |
25. | వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును. |
26. | ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును |
27. | బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను |
28. | దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి |
29. | అవి అతిపరి శుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును. |
30. | మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింప వలెను. |
31. | మరియు నీవు ఇశ్రాయేలీయులతోఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను; |
32. | దానిని నర శరీరము మీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయ కూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠిత మైనదిగా నుండవలెను. |
33. | దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. |
34. | మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని |
35. | వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము. |
36. | దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండ వలెను. |
37. | నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. |
38. | దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. |
← Exodus (30/40) → |