← Acts (3/28) → |
1. | పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా, |
2. | పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. |
3. | పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా |
4. | పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి. |
5. | వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. |
6. | అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి |
7. | వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. |
8. | వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను. |
9. | వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి |
10. | శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి,వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. |
11. | వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి. |
12. | పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెనుఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? |
13. | అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చే¸ |
14. | మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి. |
15. | మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము. |
16. | ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను. |
17. | సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. |
18. | అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయ ములను ఈలాగు నెరవేర్చెను. |
19. | ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును |
20. | మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి. |
21. | అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము. |
22. | మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను. |
23. | ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను. |
24. | మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి. |
25. | ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు. |
26. | దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను. |
← Acts (3/28) → |