← 1Samuel (21/31) → |
1. | దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడినీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా |
2. | దావీదురాజు నాకు ఒక పని నిర్ణయించినేను నీ కాజ్ఞాపించి పంపినపని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని; |
3. | నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండిన యెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా |
4. | యాజకుడుసాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. |
5. | అందుకు దావీదునిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పని వారిబట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. |
6. | అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చనిరొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతని కిచ్చెను. |
7. | ఆ దినమున సౌలుయొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పసుల కాపరులకు పెద్ద |
8. | రాజు పని వేగిరముగా జరుగవలెనని యెరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీయొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా |
9. | యాజ కుడుఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గ మునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదుదానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను. |
10. | అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకువచ్చెను. |
11. | ఆకీషు సేవకులుఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచుసౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా |
12. | దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. |
13. | కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు, ఉమి్మ తన గడ్డముమీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను. |
14. | కావున ఆకీషురాజుమీరు చూచితిరికదా? వానికి పిచ్చిపట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి? |
15. | పిచ్చిచేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా? అని తన సేవకులతో అనెను. |
← 1Samuel (21/31) → |