← Romans (6/16) → |
1. | ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా? |
2. | అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? |
3. | క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? |
4. | కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు. |
5. | మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థా నముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము. |
6. | ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము. |
7. | చనిపోయినవాడు పాపవిముక్తు డనితీర్పుపొందియున్నాడు. |
8. | మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, |
9. | మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము. |
10. | ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు |
11. | అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. |
12. | కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. |
13. | మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. |
14. | మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. |
15. | అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికిని కూడదు. |
16. | లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? |
17. | మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, |
18. | పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. |
19. | మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. |
20. | మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. |
21. | అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే, |
22. | అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. |
23. | ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. |
← Romans (6/16) → |