← Psalms (96/150) → |
1. | యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి |
2. | యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. |
3. | అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి |
4. | యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు. |
5. | జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు. |
6. | ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి. |
7. | జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. |
8. | యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి. |
9. | పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. |
10. | యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి |
11. | యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. |
12. | పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక. |
13. | భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు చున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. |
← Psalms (96/150) → |