← Psalms (94/150) → |
1. | యెహోవా, ప్రతికారముచేయు దేవా, ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము |
2. | భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము |
3. | యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? |
4. | వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు. |
5. | యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని |
6. | యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు |
7. | విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు. |
8. | జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? |
9. | చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? |
10. | అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా? |
11. | నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది. |
12. | యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. |
13. | భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. |
14. | యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. |
15. | నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు. |
16. | దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? |
17. | యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును. |
18. | నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. |
19. | నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది. |
20. | కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా? |
21. | దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. |
22. | యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. |
23. | ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. |
← Psalms (94/150) → |