← Psalms (90/150) → |
1. | ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. |
2. | పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు |
3. | నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. |
4. | నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి. |
5. | వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు |
6. | ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును. |
7. | నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము. |
8. | మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి. |
9. | నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము. |
10. | మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. |
11. | నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును? |
12. | మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. |
13. | యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. |
14. | ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము. |
15. | నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోష పరచుము. |
16. | నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. |
17. | మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము. |
← Psalms (90/150) → |