← Psalms (89/150) → |
1. | యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను. |
2. | కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను. |
3. | నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి యున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను |
4. | తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.) |
5. | యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. |
6. | మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు? |
7. | పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు. |
8. | యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు. |
9. | సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు. |
10. | చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. |
11. | ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. |
12. | ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి. |
13. | పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది. |
14. | నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. |
15. | శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు. |
16. | నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు. |
17. | వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. |
18. | మా కేడెము యెహోవావశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. |
19. | అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. |
20. | నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను. |
21. | నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును. |
22. | ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు. |
23. | అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను. |
24. | నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. |
25. | నేను సముద్రముమీద అతని చేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను. |
26. | నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. |
27. | కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. |
28. | నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును. |
29. | శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. |
30. | అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల |
31. | వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల |
32. | నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. |
33. | కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. |
34. | నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. |
35. | అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు |
36. | చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు |
37. | నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను. |
38. | ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు. |
39. | నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు. |
40. | అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు |
41. | త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను. |
42. | అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి యున్నావు |
43. | అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు |
44. | అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు |
45. | అతని ¸°వనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.) |
46. | యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? |
47. | నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు? |
48. | మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు? |
49. | ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమా ణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ? |
50. | ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము. |
51. | యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు. |
52. | యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్ ఆమేన్. |
← Psalms (89/150) → |