| ← Psalms (80/150) → |
| 1. | ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము. |
| 2. | ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము. |
| 3. | దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము. |
| 4. | యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిచ్చెదవు? |
| 5. | కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు. |
| 6. | మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా జేయు చున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అప హాస్యము చేయుచున్నారు. |
| 7. | సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము. మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము. |
| 8. | నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి |
| 9. | దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను |
| 10. | దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ రించెను. |
| 11. | దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను. |
| 12. | త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి? |
| 13. | అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. |
| 14. | సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. |
| 15. | నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. |
| 16. | అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు. |
| 17. | నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. |
| 18. | అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము |
| 19. | యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము. |
| ← Psalms (80/150) → |