| ← Psalms (33/150) → |
| 1. | నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము... చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. |
| 2. | సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి |
| 3. | ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. |
| 4. | యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది. |
| 5. | ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. |
| 6. | యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. |
| 7. | సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. |
| 8. | లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. |
| 9. | ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. |
| 10. | అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. |
| 11. | యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. |
| 12. | యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. |
| 13. | యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. |
| 14. | తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. |
| 15. | ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు. |
| 16. | ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. |
| 17. | రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. |
| 18. | వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును |
| 19. | యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది. |
| 20. | మనము యెహోవా పరిశుద్ధనామమందు నమి్మకయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది |
| 21. | మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. |
| 22. | యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక. |
| ← Psalms (33/150) → |