← Psalms (147/150) → |
1. | యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము. |
2. | యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు |
3. | గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు. |
4. | నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. |
5. | మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు. |
6. | యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. |
7. | కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. |
8. | ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు |
9. | పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. |
10. | గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు. |
11. | తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. |
12. | యెరూషలేమా, యెహోవాను కొనియాడుము సీయోనూ, నీ దేవుని కొనియాడుము. |
13. | ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు. |
14. | నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే |
15. | భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. |
16. | గొఱ్ఱబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. |
17. | ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? |
18. | ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును, |
19. | ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. |
20. | ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి. |
← Psalms (147/150) → |