← Psalms (141/150) → |
1. | యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము |
2. | నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. |
3. | యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. |
4. | పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. |
5. | నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను. |
6. | వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడ ద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. |
7. | ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మాయెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి. |
8. | యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము. |
9. | నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము. |
10. | నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక. |
← Psalms (141/150) → |