Psalms (104/150)  

1. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.
2. వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు.
3. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
4. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొనియున్నాడు.
5. భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.
6. దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను.
7. నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.
8. నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.
9. అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
10. ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.
11. అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.
12. వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
13. తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.
14. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు
15. అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు
16. యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి.
17. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి.
18. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
19. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ మించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును
20. నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.
21. సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి.
22. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.
23. సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు కొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు.
24. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
25. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి.
26. అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి.
27. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి
28. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును.
29. నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును.
30. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.
31. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక.
32. ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును
33. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.
34. ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.
35. పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.

  Psalms (104/150)