| ← Psalms (102/150) → |
| 1. | యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము. |
| 2. | నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము. |
| 3. | పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి. |
| 4. | ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను. |
| 5. | నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొని పోయినవి. |
| 6. | నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను. |
| 7. | రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను. |
| 8. | దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం తురు. |
| 9. | నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. |
| 10. | నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు. |
| 11. | నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను. |
| 12. | యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును. |
| 13. | నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను. |
| 14. | దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు |
| 15. | అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు |
| 16. | ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను |
| 17. | ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు. |
| 18. | యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు |
| 19. | మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు |
| 20. | చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును |
| 21. | ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు |
| 22. | వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును |
| 23. | నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను. |
| 24. | నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును. |
| 25. | ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. |
| 26. | అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. |
| 27. | నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు. |
| 28. | నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. |
| ← Psalms (102/150) → |