← Proverbs (6/31) → |
1. | నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల |
2. | నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు |
3. | నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. |
4. | ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము. |
5. | వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము. |
6. | సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. |
7. | వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను |
8. | అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. |
9. | సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? |
10. | ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు |
11. | అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును. |
12. | కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు |
13. | వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో గురుతులు చూపును. |
14. | వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. |
15. | కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును. |
16. | యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు |
17. | అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును |
18. | దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును |
19. | లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. |
20. | నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. |
21. | వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. |
22. | నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. |
23. | ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. |
24. | చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును. |
25. | దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము. |
26. | వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. |
27. | ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? |
28. | ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? |
29. | తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. |
30. | దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా. |
31. | వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. |
32. | జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే |
33. | వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు. |
34. | భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు. |
35. | ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పు కొనడు. |
← Proverbs (6/31) → |