← Proverbs (30/31) → |
1. | దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు.ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట. |
2. | నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు. |
3. | నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. |
4. | ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? |
5. | దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. |
6. | ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. |
7. | దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము; |
8. | వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. |
9. | ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో. |
10. | దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. |
11. | తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. |
12. | తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు. |
13. | కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి! |
14. | దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు. |
15. | జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవుచాలును అని పలుకనివి నాలుగు కలవు. |
16. | అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. |
17. | తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. |
18. | నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, |
19. | బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ. |
20. | జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును. |
21. | భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు. |
22. | అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు, |
23. | కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి. |
24. | భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి. |
25. | చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. |
26. | చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. |
27. | మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును. |
28. | బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును. |
29. | డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు |
30. | అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము |
31. | శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. |
32. | నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము. |
33. | పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును |
← Proverbs (30/31) → |