← Proverbs (13/31) → |
1. | తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. |
2. | నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు. |
3. | తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును. |
4. | సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును. |
5. | నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. |
6. | యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును. |
7. | ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు. |
8. | ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు. |
9. | నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును. |
10. | గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. |
11. | మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును. |
12. | కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. |
13. | ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును. |
14. | జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును. |
15. | సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము. |
16. | వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. |
17. | దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు. |
18. | శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. |
19. | ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. |
20. | జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. |
21. | కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. |
22. | మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. |
23. | బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు. |
24. | బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. |
25. | నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. |
← Proverbs (13/31) → |