Matthew (8/28)  

1. ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
3. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను.
4. అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి
6. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.
7. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా
8. ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
9. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
11. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
12. రాజ్య సంబంధులు1 వెలుపటి చీకటిలోనికి త్రోయబడు దురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
13. అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.
14. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
15. ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
16. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
17. ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
18. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
19. అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెద నని ఆయనతో చెప్పెను.
20. అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
21. శిష్యులలో మరియొకడుప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
22. యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.
23. ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.
24. అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా
25. వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
26. అందుకాయనఅల్పవిశ్వాసు లారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
27. ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడు చున్నవని చెప్పుకొనిరి.
28. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
29. వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
30. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
31. ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
32. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
33. వాటిని మేపుచున్నవారు పారి పోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
34. ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.

  Matthew (8/28)