← Leviticus (5/27) → |
1. | ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును. |
2. | మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్రమృగ కళేబరమేగాని అపవిత్రపశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. |
3. | మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. |
4. | మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. |
5. | కాబట్టి అతడు వాటిలో ఏవిషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని |
6. | తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేయును. |
7. | అతడు గొఱ్ఱపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. |
8. | అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరు వాత అతడు పాపపరిహారార్థమైనదానిని మొదట నర్పించి, దాని మెడనుండి దాని తలను నులమవలెను గాని దాని నూడదీయకూడదు. |
9. | అతడు పాపపరిహారార్థబలి పశురక్త ములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాపపరిహారార్థబలి. |
10. | విధిచొప్పున రెండవదానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. |
11. | రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపముచేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థబలి గనుక దానిమీద నూనెపోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు. |
12. | అతడు యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది పాపపరిహా రార్థబలి. |
13. | పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును. |
14. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను |
15. | ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విష యములో పొరబాటున పాపముచేసినయెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలోనుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవాయొద్దకు వాడు తీసికొని రావలెను. |
16. | పరిశుద్ధమైనదాని విషయ ములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకునికియ్యవలెను. ఆ యాజకుడు అప రాధపరిహారార్థ బలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. |
17. | చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరిం చును. |
18. | కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. |
19. | అది అపరాధపరిహారార్థబలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. |
← Leviticus (5/27) → |