| ← Job (33/42) → |
| 1. | యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము. |
| 2. | ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది. |
| 3. | నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. |
| 4. | దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను |
| 5. | నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము. |
| 6. | దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే |
| 7. | నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు. |
| 8. | నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను. |
| 9. | ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను. |
| 10. | ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. |
| 11. | ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు. |
| 12. | ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. |
| 13. | తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తర మియ్యడు దేవుడు నరులశక్తికిమించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు? |
| 14. | దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు |
| 15. | మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో |
| 16. | నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు |
| 17. | గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు |
| 18. | ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును. |
| 19. | వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును |
| 20. | రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును |
| 21. | వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును |
| 22. | వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును. |
| 23. | నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకువేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల |
| 24. | దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. |
| 25. | అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరో గ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును. |
| 26. | వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషిం చును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. |
| 27. | అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు |
| 28. | కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది. |
| 29. | ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడునట్లు |
| 30. | కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు. |
| 31. | యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను. |
| 32. | చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు చున్నాను. |
| 33. | మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించె దను. |
| ← Job (33/42) → |