| ← Isaiah (40/66) → | 
| 1. | మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, | 
| 2. | నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. | 
| 3. | ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. | 
| 4. | ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను. | 
| 5. | యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. | 
| 6. | ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది | 
| 7. | యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. | 
| 8. | గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. | 
| 9. | సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. | 
| 10. | ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగానడచుచున్నది. | 
| 11. | గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును. | 
| 12. | తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? | 
| 13. | యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? | 
| 14. | ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు? | 
| 15. | జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి. | 
| 16. | సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు | 
| 17. | ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. | 
| 18. | కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు? | 
| 19. | విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును | 
| 20. | విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును. | 
| 21. | మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా? | 
| 22. | ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. | 
| 23. | రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు లుగా చేయును. | 
| 24. | వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. | 
| 25. | నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. | 
| 26. | మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు. | 
| 27. | యాకోబూనా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? | 
| 28. | నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. | 
| 29. | సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. | 
| 30. | బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు ¸°వనస్థులు తప్పక తొట్రిల్లుదురు | 
| 31. | యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. | 
| ← Isaiah (40/66) → |