← Isaiah (24/66) → |
1. | ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. |
2. | ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలు గును. |
3. | దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు |
4. | దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. |
5. | లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. |
6. | శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు. |
7. | క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను |
8. | ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. |
9. | పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను |
10. | నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది. |
11. | ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు. |
12. | పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను. |
13. | ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును. |
14. | శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్న వారు కేకలువేయుదురు. |
15. | అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. |
16. | నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత ములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. |
17. | భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను |
18. | తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి |
19. | భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది |
20. | భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును. |
21. | ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమిమీదనున్న భూరాజులను దండించును |
22. | చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. |
23. | చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును. |
← Isaiah (24/66) → |