← Isaiah (11/66) → |
1. | యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును |
2. | యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును |
3. | యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. |
4. | కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును |
5. | అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. |
6. | తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. |
7. | ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. |
8. | పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును |
9. | నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును. |
10. | ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును. |
11. | ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును |
12. | జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును. |
13. | ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు |
14. | వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు |
15. | మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును. |
16. | కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును |
← Isaiah (11/66) → |