← Hosea (9/14) → |
1. | ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి. |
2. | కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. |
3. | ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు. |
4. | యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలా పము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు. |
5. | నియామక దినములలోను యెహోవా పండుగ దినముల లోను మీరేమి చేతురు? |
6. | లయము సంభవించినందున జనులు వెళ్లి పోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణమువారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువు లను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. |
7. | శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తార మైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు. |
8. | ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. |
9. | గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గు లైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొను చున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధిం చును. |
10. | అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రా యేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి. |
11. | ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు. |
12. | వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థల ములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. |
13. | లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. |
14. | యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము. |
15. | వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు. |
16. | ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను. |
17. | వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. |
← Hosea (9/14) → |