← Hosea (6/14) → |
1. | మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును |
2. | రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. |
3. | యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహో వానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును. |
4. | ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును. |
5. | కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటిమాటల చేత వారిని వధించి యున్నాను. |
6. | నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. |
7. | ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాస ఘాతకులై నా నిబంధ నను మీరియున్నారు. |
8. | గిలాదు పాపాత్ముల పట్టణ మాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కన బడుచున్నవి. |
9. | బందిపోటుదొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై యున్నారు, |
10. | ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు. |
11. | చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును. |
← Hosea (6/14) → |