← Ezekiel (5/48) → |
1. | మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము. |
2. | పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును. |
3. | అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము; |
4. | పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును. |
5. | మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి. |
6. | అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి |
7. | కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి. |
8. | కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. |
9. | నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. |
10. | కావున నీ మధ్య తండ్రులు తమ కుమారు లను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును. |
11. | నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు |
12. | కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును. |
13. | నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు |
14. | ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. |
15. | కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దిం పులచేతను నేను నిన్ను శిక్షింపగా |
16. | నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను. |
17. | ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. |
← Ezekiel (5/48) → |