← Deuteronomy (29/34) → |
1. | యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. |
2. | మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెనుయెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనము నకును చేసినదంతయు, అనగా |
3. | ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్య ములను మీరు కన్నులార చూచితిరి. |
4. | అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు. |
5. | నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు. |
6. | మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చు చున్నాడు. |
7. | మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా |
8. | మనము వారిని హతము చేసి వారి దేశ మును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయుల కును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు. |
9. | కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను. |
10. | నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, |
11. | నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, |
12. | అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, |
13. | నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. |
14. | నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను |
15. | ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. |
16. | మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు. |
17. | వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా. |
18. | ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబం ధనను మీతో చేయుచున్నాను. |
19. | అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. |
20. | అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. |
21. | ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపము లన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును. |
22. | కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి |
23. | వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి |
24. | యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. |
25. | మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి |
26. | తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి |
27. | గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. |
28. | యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. |
29. | రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు. |
← Deuteronomy (29/34) → |