| ← 2Corinthians (3/13) → |
| 1. | మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టు చున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? |
| 2. | మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యు లందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా? |
| 3. | రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు. |
| 4. | క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు. |
| 5. | మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. |
| 6. | ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును. |
| 7. | మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహి మతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి. |
| 8. | ఇట్లుండగా ఆత్మసంబంధ మైన పరిచర్య యెంత మహిమగలదై యుండును? |
| 9. | శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కల దగును. |
| 10. | అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను. |
| 11. | తగ్గిపోవునదె మహిమగలదై యుండినయెడల,నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా. |
| 12. | తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రా యేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను. |
| 13. | మేమట్లు చేయక,యిట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాటలాడు చున్నాము. |
| 14. | మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. |
| 15. | నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని |
| 16. | వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. |
| 17. | ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. |
| 18. | మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. |
| ← 2Corinthians (3/13) → |