| ← 1Corinthians (10/16) → |
| 1. | సహోదరులారా, యీ సంగతి మీకు తెలియ కుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి; |
| 2. | అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; |
| 3. | అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; |
| 4. | అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. |
| 5. | అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. |
| 6. | వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. |
| 7. | జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. |
| 8. | మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. |
| 9. | మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి. |
| 10. | మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. |
| 11. | ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. |
| 12. | తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. |
| 13. | సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. |
| 14. | కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూర ముగా పారిపొండి. |
| 15. | బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి |
| 16. | మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? |
| 17. | మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము. |
| 18. | శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? |
| 19. | ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? |
| 20. | లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. |
| 21. | మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు. |
| 22. | ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బల వంతులమా? |
| 23. | అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. |
| 24. | ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను. |
| 25. | మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. |
| 26. | భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. |
| 27. | అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచి నపుడు వెళ్లుటకు మీకు మనస్సుండినయెడల మీకు వడ్డించి నది ఏదో దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. |
| 28. | అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. |
| 29. | మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయ ములో తీర్పు తీర్చబడనేల? |
| 30. | నేను కృతజ్ఞతతో పుచ్చు కొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల? |
| 31. | కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. |
| 32. | యూదులకైనను, గ్రీసుదేశస్థుల కైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ జేయకుడి. |
| 33. | ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింప బడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను. |
| ← 1Corinthians (10/16) → |