← 1Chronicles (20/29) → |
1. | మరుసటి యేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమ కూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను. |
2. | దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను. |
3. | దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేము నకు తిరిగివచ్చిరి. |
4. | అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. |
5. | మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది. |
6. | మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు. |
7. | వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. |
8. | గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి. |
← 1Chronicles (20/29) → |